Search This Blog

Loading...

Saturday, January 8, 2011

24 వ రోజు - స్వామికి మగళం
















పాశురము

అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్

నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారుకదా, స్వామి వస్తుంటే ఆయనపాదాలను చూసారు అవి కంది పోయినట్లు అనిపించింది.  పాదాలు స్వతాహా గులాభి రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపికి స్వామి నడిచి వచ్చినందుకు కంది పోయాయి అనుకుంటున్నారు. వీళ్ళేమి కోరి రాలేదు కదా. కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి అనందిద్దామని వచ్చారు. ఆయన సింహాసనం పై కూర్చొని, చిలిపి వాడు కదా, వీళ్ళను ఏడిపిద్దాం అన్నట్లుగా ఒక కాలు క్రింద పెట్టి “సవ్య పాదం ప్రసవ్య” ఎడమకాలు ప్రసరింపచేసాడు, “సృత దురితహరం దక్షినం కుంచయిత్వా” దానిపై కుడి కాలు ఉంచి వీళ్ళకు తన పాదాలు కనిపించేలా అడిస్తూ కూర్చున్నాడు. ముఖారవిందం పదారవిందం అన్నీ అరవిందములవలే సుకుమారము, సౌగంద్యము, కోమలత్వము కల్గినవి కదా, ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ భాదపడ్డారు. వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని  మంగళం పాడుతున్నారు.
ఈ రోజు పాశురాన్ని మాంగళాశాసన పాశురం అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎట్లాంటివాడో, తనూ ఎట్లాంటివాడో  తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తనో ఏ జ్ఞానం లేనివాడు, భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతుని కున్న శక్తిని మరచి ఆయన కున్న సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞానిని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒక నాడు జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు  తనని రక్షించేవాడని భావించే అతను, భక్తితో ఈ నాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైన ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం ఆలయాల్లో తలుపులు, తాళం అని ఇలా చేస్తుంటాం, జగత్ రక్షణ చేసే వాడికి మనం రక్షణ ఏంటి కనుక. అది ప్రేమచే చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎట్లా అయితే హరించుకు పోతుందో అట్లా దోషాలన్ని హరించుగాక అని మంగళం పాడుతాం.


గోదాదేవి కి ఈ విషయం వాళ్ళ నాన్న గారు తెలిపారు. విష్ణుచిత్తులవారు మధురానగరం వెళ్ళి పాండ్య రాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. వీళ్ళ కంటికి నీవు కనపడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు. పల్-ఆండు అనేక సంవత్సరాలు, పల్-ఆండు అనేక సంవత్సరాలు  పలకోటి నూరు- ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం, శంఖానికి, చక్రానికి, పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు. శ్రీరామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసినవారుకూడా రామునికి ఎన్నొ సార్లు మంగళం పాడారు. జగత్ కారణ తత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా, ఆ చతుర్ హస్తాల్లో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్నీ వెనక్కి దాచేసుకో అని దేవకీ అంటుంది. ఇవి ప్రేమతో చేసేవి. మన ఆయాల్లో హారతి ఇచ్చే సంప్రదాయం కూడా ఇలా వచ్చిందే. అయితే హారతిని కళ్ళకు హద్దుకోరాదు. హారతిని ఆర్పి పక్కన పెట్టి, ఎవరికైతే దృష్టిదోశం తీస్తామో వారికి కళ్ళు, పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం.  నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం. ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా ,ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం, ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి కనుక.
ఆండాళ్ ఏనాడో ఆయన నడిచివచ్చినందు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది. వీళ్ళకు కాలంతో ప్రమేయం లేదు, ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజు గోడ లాంటిదే. వీరి ముందేనా అంతా జరుగుతున్నది అని పరమ భక్తులు భావిస్తారు. "అన్ఱివ్వులగమ్" ఆనాడు వామనుడై లోకాలను "అళందాయ్" కొలిచిన, ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయే!   "అడి" ఆ పాదాలకు "పోత్తి" మంగళం.
"శెన్ఱ్" వెళ్ళి "అంగు" అక్కడ ఉన్న "త్తెన్-ఇలంగై" దక్షిన దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురున్ని "శెత్తాయ్" సంహరించిన "తిఱల్" నీ భుజ భలానికి "పోత్తి" మంగళం.
"పొన్ఱ" తారుమారు అయ్యేలా "చ్చకడం" శకటాసురున్ని "ఉదైత్తాయ్" తన్ని అంతమొందిచ్చావు, ఏడు నెలల బాలుడవి, "పుగర్" నీ కీర్తికి "పోత్తి" మంగళం.
"కన్ఱు" దూడ రూపంలో ఉన్న వత్సాసురున్ని "కుణిలా" కర్రలా మార్చి వెలగ పండులో దాగిఉన్న కపితాసురునిపై "వెఱిందాయ్" గిరగిరా తిరిగి విసిరిపాడేసి "కరిల్" నీ పాదానికి "పోత్తి" మంగళం.
"కున్ఱు" పర్వతాన్ని "కుడైయా" గొడుగులా  "వెడుత్తాయ్" ఎత్తి పట్టి అందరిని దరిన చేర్చుకున్న నీ "కుణమ్" సౌశీల్య గుణానికి "పోత్తి" మంగళం.
ఆండాళ్ స్వామిచేసిన ఇన్ని కార్యాలను కీర్తించిందికదా, ఎక్కడైనా దృష్టిదోశం తగులుతుందేమోనని, ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా "వెన్ఱు" గెలిచి "పకై కెడుక్కుమ్" విరోదభావం లేకుండా చేసే "నిన్ కైయిల్" నీ హస్తంలో ఉన్న "వేల్" శూలాయుదానికి, తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుదం "కూర్వేల్"  ఇదేకదా, ఆ శూలానికి "పోత్తి" మంగళం.
"ఎన్ఱెన్ఱ్" ఎల్లప్పుడు "ఉమ్ శేవకమే" నీ చరితమునే "యేత్తి" కీర్తించేలా "ప్పఱై" ఆ వాయిద్యాన్ని "కొళ్వాన్" తీసుకుంటాం. "ఇన్ఱు" ఈ రోజు "యాం" మెం ఎందుకు "వందోం" వచ్చామో "ఇరంగ్" తెలుసుకొని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు.

నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు, ఈ రోజు దృష్టి దోషం తొలగటానికి మంగళం పాడుతున్నారు.  విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది .ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది, ఇది మన ఆండాళ్ మనకు తెలుపుతుంది.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

23 వ రోజు - సృష్టి కార్యం నుండి తరువాత వరకు స్వామి దశ














పాశురము

మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా  ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్

ఈ రోజు ఆండాళ్ ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే అద్భుత వర్ణన ఈ నాటి పాటలో చేస్తుంది, అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి, సాహిత్యం తెలియాలంటే తిరుప్పావై లోకి రావాలి, ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి, ఇక ఇదీ అదీ అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికి ఇది మూలం ఇక్కడి నుండే బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు. 
ఈ రోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాశురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం, ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాదాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు ఎలగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం ఇకపై శాస్త్రాలు వర్తించవు ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి  చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరిక్షలు ఉంటాయి. ఇక భగవంతుణ్ణి సన్నిధానానికి చేరాక ఇక  భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మనా చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఈ విషయాన్ని మనం రామాయణంలో గమనించవచ్చు. రాముడు విభీషనుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది. మొడట తన అభిప్రాయం చెప్పడం లక్ష్మణ, సుగ్రీవాదులను ఒప్పించటం, తరువాత సుగ్రీవుణ్ణి పంపి విభీషనుణ్ణి రప్పించటం ఒక పెద్ద ప్రక్రియ సాగింది. “లొచనాభ్యాం పిభన్నివ” అంటూ ఒక కంటి చూపుతో తను విభీషనునికి రక్షణ ఇవ్వటంలో జరిగిన కాల విలంబనని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు. అలాగే మనవాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు. శరణు అంటూ వచ్చిన విభీషనుడికి రాముడే దాసుడై విభీషనుడు చెప్పినట్లూ చేసాడు. విభీషనుడు రాముడిని చేరటానికి శరణాగతే మార్గం అయ్యినందున, అదే మార్గం రాముడికీ చెప్పాడు. సముద్రుడికి శరణాగతి చేయ్యటం ఆ సముద్రుడు అర్హుడా కాడా కూడా చూడలేదు రాముడు. ఇదీ స్వామి తత్వం భక్తుల విషయంలో. తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు.
అందుకే మన వాళ్ళు  నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరియాలో ఆదేశించారు. ఈ రోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి, క్రమంగా నడచి వచ్చి సింహాసనం పై కూర్చోని తమ మొరలని ఆలకించమని ప్రార్థిస్తుంది. “క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది, దానిపై కూర్చుని ఉంటే మేం అడిగినవి తప్పక ప్రసాదిస్తావు,  దానిపై నీవు కూర్చొంటే “యాం వంద కారియం ఆరాయ్-అందరుళ్” మెం ఒక కార్యార్తులమై వచ్చాం, మేం ఎం చేయదల్చుకున్నామో తెలుసుకొని మేం ఎట్లా చెయ్యలో మాకు తెలుపు.
ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎట్లా లేచిరమ్మని చెబుతుంది అనేది ఒక అద్భుతమైన వర్ణన. గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నింటిని తనతో పాటు సమానంగా తీసుకొని వస్తుంది. అందులో ఒకటి పై పై కి కనిపించే కృష్ణ-గోపికల కథ. రెండవది తిరుప్పావై సారాంశమే వేదం కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెబుతుంది. ఇక మూడవది మనం భగవంతుణ్ణి చూసే స్థానానికి వెళ్ళేప్పుడు మనల్ని మనం ఎట్లా సిద్దం చేసుకొని వెళ్ళవలె అనేది తెలుపుతుంది. భగవంతుణ్ణి ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం విగ్రహా రూపకంలోనే కదా, అది మన ఇంట్లో ఆరాధన చేసుకొనే విగ్రహం ఐనా కావచ్చు లేక ఆలయాల్లో ఉన్న అర్చా మూర్తి ఐనా కావచ్చు. అప్పుడప్పుడు మన ఆలయాల్లో భగవంతుడు బయటికి వస్తూ ఉండే ఆ పద్దతి ఏంటి, ఇక నాలుగవది శ్రీకృష్ణుడు తన భవనంలోంచి ఎట్లా రావాలి ఇవన్నీ తెలుపుతు వస్తుంది ఆండాల్ తల్లి.

ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానా కాలంలో కొండ గుహల్లో నిదురించే సింహం తనంతట తాను మేలుకాంచి బయటికి వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణిస్తుంది. “మారి” వానాకాలం అనగానే విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలని మరిపిస్తుంది. యుద్దాలు చేసేవారు కూడా వానా కాలంలో ఆపేస్తారుకదా. సుగ్రీవుడు రాజ్య సుఖాలతో హాయిగా ఉంటే, రాముడు మాల్యాద్రి పర్వతం పై ఉండి తనకు జరిగిన సీతా విరహాన్నీ లక్ష్మణ స్వామికి విన్నపించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాం మరొక వానా కాలం కోసం ప్రతిక్షిస్తున్నాం.  ఏ వానా కాలంలో ఉన్నాం అంటే రక రకాల దుఃఖాలను సంతతమూ వర్షించే ఈ భూమి పై ఉన్నాం కదా “బహుదా సంతత దుఖ:వర్శిని  బవ దుర్దినే అద:స్కలితం” అంటారు మన యామునాచార్యులవారు.  ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం, “అవివేక ఘన అంద ద్విగ్ముఖే”అవివేకం అనే కారు మబ్బులు జ్ఞానమనే సూర్యున్ని కప్పుకొని దారి తప్పి పోయాం. వివేకం అంటే విడదీసి బ్రతకటం, దేన్ని విడదీసి అంటే ఆత్మను మరియూ శరీరాన్ని వేరుగా చూసి బ్రతకడం, ఇలా బ్రతకక పోవడమే అవివేకం, దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షింస్తుంది, సూర్యుడు కనిపించడం లేదు. మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికి వదిలి ఉండని అచ్యుత భానున్ని కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బుల్ని మన అంతట మనం తొలగించుకోగలమా, లేదు కదా, మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనను చూడలేం. అందుకే “మాం అవలోకయా అచ్యుత” అని ప్రార్థిస్తారు. నేను నిన్ను చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు. అలా  ప్రార్థిస్తూ మరొక వాన కావాలని మన పూర్వులు కోరుతున్నారు, అదేంటంటే
“త్వదీక్షణ సుదా సింధు విక్షేప పసీకరైహి|
కారుణ్య మారుతా నీతైహి శీతలైహి అభిషించమాం||”

"హే భగవన్! నీ చూపులే సాగరాలు, అందులో కారుణ్యం అనే గాలులు వీస్తుంటాయి, ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో  తేలుతూ ఒడ్డున ఉండే వారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీదయని కురిపించి ముంచెత్తు".   ఈ వానను కోరుకుంటున్నారు.

అలాంటి వానాకాలంలో “మలై మురైంజిల్” పర్వతపు గుహల్లో “మన్ని క్కిడందుఱంగుం” మన్నికగా కాల్లు ముడుచుకొని పడుకొని నిదురించే “శీరియ శింగం” నిద్రలో కూడా పరాక్రమాన్నీ వీడక ఉండే సింహం. శక్తి తేజస్సు ఎప్పటికి కల్గిన సింహం. సింహం తనంతట  తానూ లేచి రావాల్సిందే కాలం లేపినప్పుడు, కానీ ఎవ్వరు దానిని లేప తగరు.  ఆండాళ్ తల్లి ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్తు జీవులకు రారాజైన ఆ భగంతుడిని భావిస్తుంది. సింహం ఎలాగైతే గుహల్లోంచి బయటకు రావడం అనేది మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటకు రావడమా అన్నట్లుగా చెబుతుంది. “శీరియ శింగం” శ్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా, సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ శ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఆండాల్ అది “శీరియ శింగం” అని చెబుతుంది.


 “అరివుత్తు” ఆ సింహం తనంతట తాను లేచి “త్తీవిరిత్తు” ఒక్క సారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేట్లుగా తెరిచింది.  “వేరి మయర్ పొంగ” తన జూలును గగుర్పాటు వల్ల ఒక్క సారి దులుపు కొని “ఎప్పాడుం పేరుందుదఱి” ఇటూ అటూ దొర్లుతూ,  “మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు” ఒక పెద్దగా గర్జిస్తూ  “పోదరుమా పోలే” అప్పుడది బయలుడేరినట్లే  నీవూ అట్లా రావాలి.

సృష్టి పూర్వ దశ నుండి సృష్టి  తరువాత దశ వరకు ఆండాళ్ స్వామిని సింహం తో పోలుస్తుంది. ఆది ఎట్లా అని చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టి కి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆసంకల్పం “తడైక్షత భహుష్యాం ప్రజా యేయేతి” నెనే నానుండి అనేకమందిని తీద్దును గాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు.

మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు,  జలంలోంచి పృథ్విని తీస్తాడు. ఇక వీటిని సగం సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మల్లీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీదీ ఒక పెద్ద భాగం గా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్దం చేస్తాడు. అయితే ప్రతీదాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కల్గి ఉంటాయి. ఇవన్నీ కల్పి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంక్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే అది. “యుగప్పత్ సృష్టికార్యం”  ఒక చిటికెలో సృష్టికార్యం జరిగి పోయింది, అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం. ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మ ను పెడుతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి పదకోండు ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశం చేసి, ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్నీ వస్తువులలో అంతర్యామి అయ్యి తానుంటాడు.
ఈ కార్యాన్నంతా ఆండాళ్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఒక శీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి, సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో, సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతటా తానూ ఐచ్చికంగా చేసేది. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచీందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటికి తీస్తాడు. సింహం తన జూలును విప్పార్చి తన పరిమళాన్ని అన్నివైపులా వెదజల్లినట్లే, అయితే శాస్త్రం “గందవతీ పృథ్వీ” అని చెబుతుందికదా, పరమాత్మ పరిమలం కల భూమిని దానిలోంచి నీటిని బయటికి తీస్తాడు. ఇక సింహం పడి అన్నివైపులా పొర్లుతున్నట్లుగా పరమాత్మ త్రివుత్కరణం చేసాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టికార్యాన్ని సాగించాడు. ఏర్పడ్డ ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలని ఉపదేశం చేసాడు. ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే, పరమాత్మ అన్నింటిలో అంతర్యామియై ఉన్నాడు. ఈక్కడ గోదాదేవి నాభిస్తానంలో పవళించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలో కి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. ఆలయాల్లో ఉత్సవ విగ్రహం పురపాడు కి బయలుదేరినట్లు గా కూడా భావిస్తుంది. గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపంలో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనం ఇస్తాడు. “నీ పూవైప్పూ వణ్ణా” అదసీ పుష్పం వంటి సౌందర్యం కల వాడా,  “ఉన్ కోయిల్ నిన్ఱు” నీ కోవల నుండి, అంటే ఓంకారమనేదే స్వామి ఇల్లు కదా ఆ వేద తత్వమనేది బయటికి రావాలి తన స్థానాన్ని ప్రదర్శించాలి. ఇక ఆలయాల్లోంచి ఉత్సవ మూర్తి బయటికి రావాలి, ఒక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి ఇన్నింటిని ఆండాళ్ భావిస్తోంది. “ఇంగనే పోందరిళి” ఇలానే రావాలి అని చెబుతుంది, మన ఆండాల్ “అన్నవయల్ పుదువై ఆండాళ్” పరమహంసలే నడక నేర్ప గలిగేది కద, తాను శ్రీకృష్ణుడి కూడా నేర్పుతుంది. 

“క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” అలంకృత సింహాసనంపై కూర్చొనమని ప్రార్థిస్తుంది ఆండాళ్. ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం, జ్ఞాన, అజ్ఞాన, ఐశ్వర్య, అనైశ్వర్య, ధర్మ, అధర్మ, వైరాగ్య ఇహ్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనంలోంచి సృష్టికి కావల్సిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి, ఇక ఆలయాల్లో అయితే దర్మ పీఠాసనం అంటారు, ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం ఇన్నింటినీ భావిస్తూ ఆండాళ్ శ్రీకృష్ణున్ని దానిపై కుర్చొమ్మని చెబుతుంది.


శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

22 వ రోజు - అనన్య గతిత్వం















పాశురము

అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్

మనిషి వస్తువులపై ఏర్పర్చుకున్న అభిమానము, ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుటూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవ వల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచి పోయాడట. వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు. ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉండట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచిండి. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తు పట్టే సరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. "ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కాన ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్" ఏక ఛత్రాదిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒక నాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.
మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్న అనుకుంటావా చుట్టు ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతుకుతే వాడికి గతి ఉండనే ఉండదు.

"అంగణ్ మా ఞాలత్తరశర్”  ఈ అందమైన భుమి మీద “అబిమాన పంగమాయ్ వందు” అభిమానాలను వదులుకొని వచ్చి “నిన్ పళ్ళికట్టిల్ కీరే” నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరం పై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ  ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి. ఈ దేహాల పై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పద సన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మన లాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్నీ లోకాలను వదులుకొని రావాలనంటె అది కష్టం, కాని  తరించాలి అంటె ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.
“శంగమ్ ఇరుప్పార్ పోల్” అయిటే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని  గుంపులు గుంపులుగా ఎట్లా ఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము. “వందు తలై ప్పెయ్-దోమ్” ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేసావు, మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేశాన్ని తగ్గించి ని పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం.
ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, “కింగిణివాయ్ చ్చేయ్ద” చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా  కనిపిస్తాయే, అట్లా కనిపించే  ఆనేత్రాలని  “తామరై ప్పూప్పోలే” పద్మాల్లా “శెంగణ్ శిఱుచ్చిఱిదే” అందముగా, మెల్లి మెల్లిగా  “యెమ్మేల్” మాపై  “విరయావో” ప్రసరించేట్టు చెయ్యి.  “తింగళుమ్” చంద్రుడి చల్లటిచూపులాగా “ఆదిత్తియనుమ్” సూర్యుడి కాంతి వలె  “ఎరుందాఱ్పోల్” ఇద్దరు కలిసి నట్లుగా ఉంది, ప్రేమించేవారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేశించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి “ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం” అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తె ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.
తప్పు తప్పు “అంగణ్ ఇరండుం” ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు,  “కొండు ఎంగళ్మేల్” వాటిని మాపై పడేట్లు చెయ్యి. “నోక్కుదియేల్ ఎంగళ్మేల్” ఆచూపులు మాపై పడితే  “శాపం ఇరింద్” మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్షతో పోయింది-మాకూ నీ పాద స్పర్ష కావాలి, చంద్రపుష్కరిణి లో స్నానం ఆడితే దక్షుడికి శాపం పొయ్యింది- మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణి లో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది-మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి. “చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన” నీ చూపు నాపై పడిండయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

21 వ రోజు - ఆచార్యుడి ద్వారా శరణాగతి
















పాశురము

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్

భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ, "న సంశయోస్తి తత్ భక్త పరిచర్య రతాత్మనామ్" ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందిచేట్టి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ది తప్పక కలిగే తీరును, సంశయం అక్కర లేదు అని నిరూపిస్తారు. అయితే ఆచార్యులయందు విశ్వాసం కలగటం కొంచం కష్టం, ఎందుకంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు. భగవంతుణ్ణి చేర్చటానికి వీరు తోర్పడుతారని విశ్వాసం కలగదు. ఆండాళ్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ  కనిపించని దానివైపు సాగవలే అని నేర్పుతుంది. ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి, ఒకటి ఇక్కడ భగవంతుణ్ణి  చూపించే ఆచార్యుడిమీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించే సరికి మనకు నమ్మకం కలగటం కొంచం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు, ఇతర యుగాల్లో కృష్ణుడిగా, రామునిగా కనిపించేట్టు తానూ వచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులేకాదు వేదాధ్యనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు.

ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు. అందరూ ఇంద్రుడికి అర్పించటానికి పదార్థాలను తయారుచేస్తున్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. వాళ్ళకందరికి ఈ విషయం ఎలాగో తెలుపాలి అని అనుకుని, అందరినీ ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు, సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే, ఆపై గాలి వీస్తె మన దగ్గరకు వచ్చాయి, ఆ గోవర్థన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్థన పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నపించుకున్నాడు. అందరికి సభబే అనిపించి అందరూ ఆ గోవర్థన పర్వతానికే పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి, నైవేద్యం పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రాల్ల వాన కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు, కన్నయ్యా అని అందరూ కృష్ణుణ్ణి చేరగానే, మనం  ఆరగింపు ఇచ్చిన ఆ కోండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలితో కొండను ఎత్తి అందరిని రక్షించాడు. గోవర్థనోద్దారి అయ్యాడు ఆయన.  ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు, ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడేకదా, అదే శ్రీకృష్ణార్పణ మస్తూ అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ది చేప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడంతటి వానికే తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మన లాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం.

అయితే ఇంద్రుడు దేవతల లో ఒకడు, మరి ఆ దేవతల అందరికి అదిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే, బ్రహ్మకు కూడా అసూయ కలిగి, ఇదేదో చూడాలి అని గోకులంకు వచ్చాడట. ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలుర మద్య కూర్చుని సద్దులు ఆరగిస్తుండగా చూసి, ఈ ఎంగిలి వేషాలు వేసే వాడా దేవుడంటే అని అనుకుని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలె అని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు. అంతలో ఒక గోప బాలుడు వచ్చి కృష్ణా మన గోవులు కనిపించటంలేదు అని చెప్పాడు, కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే, గోపబాలురనూ అపహరించి మరొక గుహలో దాచాడు  బ్రహ్మ. అయితే గోప బాలురను వదిలి వెడితే గోకులంలోని వారంతా కృష్ణుణ్ణి దేహశుద్ది చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ లోకం కి బయలుదేరాడు బ్రహ్మ, ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.ఎన్నెన్ని దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందరెందరి గోపబాలురను బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు. అందరి రూపాలు ఆయనే దాల్చాడు, వారి వారి ప్రవృత్తులతో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు. గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా ఆనంద తరంగితం అయ్యింది. ఇక్కడిది చేస్తూ బ్రహ్మ లోకం వెళ్ళి బ్రహ్మ రూపు దాల్చి, అక్కడివారితో తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు బాగా శుద్ది చేయండి అని చెప్పి వచ్చాడు కృష్ణుడు. బ్రహ్మకు తనలోకంలో కూడా ఆదరణ లేకుండాపోయి నంద గోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడ, ఎక్కడి గోవులు అక్కడ కనిపించాయి. ఆశ్చర్య పడి తాను దాచిన గుహల్లో చుస్తే తను దాచినవి కనిపించాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే కనిపించాడు. అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి స్వరూపాన్నీ కీర్తన చేసి, ఎందుకిచ్చావీ బ్రహ్మ పదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడ నాకు పెరిగింది, ఈ గర్వం లేని గోప జనం ఎంత అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాద దూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు పశ్చాత్తాపం చేందాడు.

అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు దరించే సరికి మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది. కనిపించక పోతే అమ్మో  అంటాం, కనిపిస్తే ఓసీ ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ, ఇంద్రులకి కనిపించే వాడిపై విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేక పోవటం. అదే భగవంతుడు ఈనాడు అర్చా స్వరూపం లో ఉన్నాడు. అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని  గుర్తించాలని అది అగ్నిహోత్రంలో, ఆదిత్యున్నిలో, జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలని అని చెప్పారు. సామాన్యులకి మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహాంలో చూడొచ్చు, ఆపై విగ్రహం లేకుండా శక్తిరూపాల్లో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పారు. కాని అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పై పై కి చూపిస్తూ  ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చ కుండానే చైతన్యంచే కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం. "ప్రతిమాసు అప్రబుద్దానాం" అంటే విగ్రహం అనేది వీటికంటే ఎదో పైకే చెంది ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది, తత్వం బట్టి కదా, అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేక విగ్రహంలో గుర్తిస్తాడు. అలాంటివాడు బాహిరమైన వాటియందు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగంటే, ఒక విద్యుత్ తీగను చూసి అదేం కాలటంలేదు, వెలగటం లేదు అని ముట్టు కుంటే ప్రాణం తీస్తుంది. కాని అదే తీగ అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ బాహిరమైన వాటియందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలక పోయినా, భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు, చివరి మెట్టు కూడా.  విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, "విగ్రహమే తత్వం" అని గుర్తించాలి.

ఆండాళ్ తిరుప్పావై సారాంశం ఆ విగ్రహం పై విశ్వాసం కలిగించటమే. అందుకే ఆండాళ్ శ్రీవెల్లిపుత్తూర్ లో వటవత్రశాయిని కొలిచింది, వేంకటాచలపతినికి శరాణాగతి చేసింది, తిరుమాలైజోలు సుందరభాహునికి మొక్కుబడి చేసింది, శ్రీరంగనాథున్ని చేరింది, శ్రీకృష్ణుడిని మనస్సులో భావించింది, పాల్కడలిలో స్వామిని పాడింది. ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించవలెనని తెలిపింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చునని తెలియజేసింది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే, ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలం.

నిన్న అమ్మని లేపారు, ఆమ్మ లేచి నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కల్సి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మనవాళ్ళంతా స్వామి వద్దకు చేరి "శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే" అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు, అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేసారు. ఈరోజు మనవాళ్ళు "మగనే!" కుమారుడా "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో అంటున్నారు. ఐతే మన వాళ్ళకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు, అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ "ఆత్త ప్పడైత్తాన్" లెక్కకు అందనన్ని "వళ్ళల్ పెరుం పశుక్కళ్" ఇచ్చే ఔదార్యం కల్గిన పశువులు, శ్రీకృష్ణుడికీ ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది. ఇచ్చే స్థితి తనది పుచ్చు కోనివాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి, ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే "ఏత్త కలంగళ్" ఎన్ని కుండలు పెట్టినా, "ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియుమ్" పాల ధారలు పొంగుతుంటాయి, ఆ పొంగటం క్రింది నుండా పాలు పొంగుతున్నాయి అన్నట్లు ఇచ్చేవి. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు,  ఆ  శాస్త్రములు కఠినమైనవి, గోవులు వనం అంతాతిరిగి అక్కడి పచ్చికను తిని, అనుభవించి మనకు స్వచ్చమైన పాలను అందించినట్లే, జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడి క్లేషాలను తాము అనుభవించి తత్-సారమైన భగవత్-గుణములైన పాల దారలను మనపై కురిపిస్తారు. కుండలు శిష్యులలాంటివి అనుకోవచ్చు, ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు, తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, ఆవలి వాడు అడుగుతున్నాడే అని కొందరు,  ఆవలి వాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు, తమకు తెల్సింది చెప్పకుండా ఉండాలేక కొందరు ఇస్తుంటారు. అలాంటి జ్ఞానులనెందరినో శిష్యులుగా కల వారు మన రామానుజాచార్యులవారు. అలాంటి ఆచార్యులవద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి. పరమపదం లో నిత్యశూరులవద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా, తనను తాను తెలియనివాడైనందుకే కదా, మా మద్యకు వచ్చి మా అరాధన అందుకుంటున్నావు, ఇది మా పాలిట నీదయ. "ఊత్త ముడైయాయ్! పెరియాయ్!" నీకు దృడమైన ప్రమాణం నీకుంది వెనకాతల, వేదైక వేద్యుడివి, ఆ వేదానికే అందనివాడివి, అలా అందనివాడివి  "ఉలగినిల్ తోత్తమాయ్ నిర్ఱ" మా మద్యకు అందే వాడిలా వచ్చి "శుడరే!" దివ్య కాంతులీడుతూ ఉన్నావు, మేం క్రమం తప్పకుండా మీ అమ్మ నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం "తుయిల్ ఎరాయ్" తెలివి తెచ్చుకో. వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నపించుకున్నారు "మాత్త్తార్" శత్రువులైన వాళ్ళు "ఉనక్కు వలి తొలైందు" వాళ్ళ  భలాన్ని ప్రక్కన పెట్టుకొని "ఉన్-వాశఱ్కణ్" నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళలా "ఆత్తాదు వందు" ఎక్కడైతే నీ భాణాల దెబ్బలకు బయపడి "ఉన్-అడిపణియుమా పోలే" నీపాదాలనే సేవించుకొనేట్లుగ వస్తారో,  మేం అలానే వచ్చాం, దింతో స్వామికి భాద అయ్యి, మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా భాద పడ్డాడు, లేదయ్యా "పోత్తియాం వందోమ్" మేం కుడా ఒకనాడు వాళ్ళకేం తిసిపొలేదయా, ఒకప్పుడు మేం అభిమానం కల్గి మేం నీ దగ్గరకి రావటం ఏంటి అనుకునే వాళ్ళం, కానీ నీవంతటివాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మాదగ్గరికి కూడా రాగలవు, కానీ మేం ఆగలేక పోతున్నాం, అర్తి తక్కుటుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము. అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్నీ కాపాడుకోవటానికి నీ దగ్గరికి శరణూ అంటూ వస్తారు, మేం మా ఆత్మ రక్షణ కోసం వచ్చాం, వాళ్ళు నీ భలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం,  వాళ్ళు నీ భాణాల దెబ్బలకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోక  నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దాం అని వచ్చామయ్యా "పుగరందు" ఆనందంతో వచ్చాం, ఇక పై అంతా నీ భాద్యత అంటూ శరణాగతి చేసారు. 

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

20 వ రోజు - ఈ సంసార తాపాన్ని తొలగించగలిగేది కేవలం హరి సరస్సు మాత్రమే















పాశురము

ముప్పత్తు మూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్

అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం, మరి అమ్మను కఠినంగా మట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది, నిన్న మన వాళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడే సరికి స్వామికి కొంచం కోపం వచ్చింది, అందుచే స్వామి లేచి రాలేదు. ఈ రోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు, ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, భలం, ఋజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. అయినను లేవలేదని, ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు.

ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు,  "ముప్పత్తు మూవర్ అమరర్క్కు" ముప్పై మూడు వర్గాల దేవతలను "మున్ శెన్ఱు" ఆపదరానికంటే ముందే వెళ్ళి కాపాడే "కప్పం తవిర్క్కుం కలియే!" గొప్ప భలం కలవాడివే.  "తుయిల్ ఏరాయ్" లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు, ఏమాత్రం కోరిక లేకుండా, కేవలం నివ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా, మేం నీదగ్గరికి రావడం తప్పైందా.


 "శెప్పం ఉడైయాయ్! " సత్య పరాక్రమశాలీ, అడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి, మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా, ఎమైంది నీ మాట. " తిఱలుడైయాయ్" సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా!, "శేత్తార్క్కు వెప్పమ్కొడుక్కుం విమలా!" శత్రువులకు దుఖాఃన్ని  ఇచ్చే నిర్మలుడా, ఏదోశం అంటని వాడా. "తుయిల్ ఎరాయ్" నిద్ర లేవయ్యా.
అయితే స్వామి లేవకపోయే సరికి, అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా.  "శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్" సముదాయ అంగ సౌందర్యం కల్గి, "నప్పినై" స్వామి సంబంధంతో "నంగాయ్!" పరి పూర్ణమైన అందం కలదానా! "తిరువే!" సాక్షాత్తు నీవే లక్ష్మివి "తుయిలెరాయ్" అమ్మా మేల్కో.


వీళ్ళ  ప్రార్థనకి అమ్మ కరిగి, లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఏం కావాలర్రా అని అడిగింది. "ఉక్కముమ్" స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి, "తట్టొళియుమ్" స్నానం తర్వాత అలకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి,  " తందు" ఈ రెండు ఇచ్చి "ఉన్మణాళనై" నీ స్వామిని "ఇప్పోదే" ఇప్పుడే "ఎమ్మై" మాతో కలిపి  "నీరాట్టు" నీరాడించు. ఇలా అడగటం మనకు కొంచం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది. కాని దోషమేమి లేదు.

పురుషుడు ఆయనొక్కడే మిగతా జీవ వర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు, కొందరు వెనక ఉన్నవారుంటారు. ముందున్న వారు వెనక వాళ్ళకు మార్గ నిర్దేశం చేస్తారు. అక్కడ పరమ పదంలో నిత్యశూర వర్గానికి చేందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి, ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని సరిగా చూప గలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరుకి వెళ్ళి అక్కడ చెఱువులో స్నానం చేయాలంటే ఆ వూరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా, అలాగే.

కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెబుతూ

"హరి సరస్సివి గాహ్య ఆపీయ తేజోజలౌగం
 భవమరు పరి ఖిన్నః ఖేదమద్య త్యజామి"
 

హరీ అనేది ఒక గొప్ప సరస్సు, సంసార తాపాన్ని తొలగించ గలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే.  తాపం తగ్గాలనుకొనేవారంతా అక్కడే మునగాలి, వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమ పదంలోని నిత్యశూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు, అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది. 
ఆ హరి సరస్సు గురించి తెలిసినదానివి, నీవు మార్గం చూపిస్తే మెం దాంట్లో ప్రవేశించగలం అని, అమ్మ ఆండాళ్ తల్లి నీళాదేవిని అదే కోరుతుంది.  పరమాత్మను  చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పని చేస్తుంది. భగవంతుని యోక్క కళ్యాణగుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై  అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కల్సి మార్గ నిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కల్సి మేల్కోల్పుతారు .

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

19 వ రోజు - సృష్టికి ముందు స్వామి దశ












పాశురము

కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై  పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్

మనిషికి ఎన్ని శాస్త్రములు భోదించినా, శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై. శృంగారం  అనేది శరీరాన్ని క్షీణింపచేసేది, కాని దాన్ని మనిషి ఇష్టపడతాడు, దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి.  వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటీ అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది.
"కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాది మంగళమ్" అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం, అమ్మ తన వక్షస్తలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది, ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు, ఓహో అలాంటి స్వామీ నీకు మంగళం. ఏమిటండీ ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు. కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా!  లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది, కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకూ ఒక బ్రతుకేనా! అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించ దగినది కానీ అనుభవించ దగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది-ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి, అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది.
నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది, కాని అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని, నేనే తెరుస్తాలే అని ఒక్క సారి అమ్మ చేయి లాగే సరికి ఆవిడ ఆయన వక్షస్తలం పై వాలిపోయింది. ఆమే స్పర్శతో ఆయన ఒంటిపై సృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరమవుతానేమోనని స్వామిని వదలలేదు. వీళ్ళు  బయటనుండి గమనించి లోపల సన్నిశాన్ని ఇలాపాడుతున్నారు.

 "కుత్తు విళక్కెరియ" చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి, ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి, అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా!! నీవు తలుపు తెరువడం లేదు సరికదా స్వామినీ తలుపు తెరువనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు.

గతంలో కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీళాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. "కోట్టుక్కాల్" ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల "కట్టిల్మేల్" కట్టె మంచం లో "మెత్తెన్ఱ" మెత్తటి అతి సుకుమారమైన, "పంచ శయనత్తిన్" పంచశయనంపై  "మేల్ ఏఱి" పడుకొని ఉన్నారు. "కొత్తలర్ పూంగురల్" గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల  "నప్పిన్నై" ఆ అందగత్తే "కొంగైమేల్" వక్షస్తలం "వైత్తు క్కిడంద" స్పర్శచే మైకంలో పడి ఉన్న  "మలర్ మార్బా!" వక్షస్తలం వికసించి ఉన్న స్వామీ "వాయ్ తిఱవాయ్" నోరైనా తెరువచ్చుకదా.

అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ వద్దూ నేనే తెరుస్తా అని ఆయనను ఆమే కంటి చూపుతోనే వద్దని అనటంతో, బయటనుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటంలేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు. "మైత్తడం కణ్ణినాయ్!" కాటుకతో విశాలమైన కన్నులు కల "నీ" నివ్వు "ఉన్-మణాళనై" నీ స్వామిని "ఎత్తనై పోదుం తుయిలెర" ఇప్పటికైనా లేపి  "ఒట్టాయ్ కాణ్" మాకు చూపించవా, "ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్" ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా, "తత్తువమన్ఱు తగవ్" నీ స్వరూపానికి ఇది తగదు అని  కొంచం కఠినంగా పిలిచారు.

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

18 వ రోజు - అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించటం















పాశురము

 
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్  శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్

ఈ రోజు ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి, ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం. ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం. మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి, అయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను. తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు, కాని ఇప్పుడు బాగుపడదాం, అయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు, ఆయనకు మనలోని దోషాలు కనబడొద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి, అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీ దేవి. ఆయనలోంచి దయ,వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికీ ఆ భగవంతునికి మధ్యవర్తి గా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను "శ్రీ" అంటారు.

లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవవర్గానికి నామ రూపాలు ఇచ్చేది స్త్రీ, అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చి దిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ, అంటే ఒకనాడు మనం నామ రూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది, ప్రళయ కాలంలోకూడా. అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి, మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయొచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషకారం అంటారు.


అందుకే మన ఆలయాల్లో అమెకొక సన్నిధి ఉంటుంది, మొదట మనం మన భాదలు ఆవిడతో చెప్పుకోవాలి, అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్తలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజు మన ఆండాళ్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు, ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మనకోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఖిఃస్తే, వారు బాగుపడేంతవరకూ తన దుఖంగా భావించటం. వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, "వాత్సమ్" అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, "ల" అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా "అగలగిల్లేన్ ఇరయుమ్" అర క్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయట పడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్శ్రేయోదాయకం.


అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది, ఆయన వరాహస్వామి గా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది, ఆయన  రాముడయితే అమె సీతగా వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీళా దేవిగా వచ్చింది. భాగవతంలో మనకు నీళాదేవి అనే పేరుతో ఎవ్వరు కనిపించరు. రాధగానో, రుక్మిణి గానో, సత్యభామగానో మనకు తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తుత్వాన్ని చేయగలిగినవారు కాదు. మరి ఆయనకుండే పదహారువేల మందిలో ఎవరు నీళాదేవి అని గుర్తుంచేది. అయితే ఆయనకున్న ఎనుమండుగురు పట్టపు రాణుల్లో ఒక ఆవిడపేరు నాజ్ఞజితి. శ్రీకృష్ణుడు నీళాదేవిని ఎట్లావివాహం చేసుకున్నడని మన సంప్రదాయం తెలియ జేస్తుందో అలాగే ఈ  నాజ్ఞజితిని  వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతని వివాహమాడాటానికి శివధనస్సును చేదించినట్లే, ఈవిడని వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి నీళాదేవే పురుషకారం అంటారు.  ఈరోజు నీళాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతుంది.

"ఉందు మదకళిత్తన్"
మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు "ఓడాద తోళ్ వలియన్" ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు,   అలాంటి "నంద గోపాలన్" నందగోపాలుని "మరుమగళే!" కోడలా అంటూ పిలిచారు. సీతా దేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు.
ఆవిడ లేవలేదు.  "నప్పిన్నాయ్!" ఓ సమగ్రమైన సౌందర్య రాశి! అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. "కందం కమరుం కురలి" సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! మనం చేసిన పాపలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ."కడై తిఱవాయ్" గడియ తెరువుమా. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని.   

"కోరి అరైత్తన కాణ్" కోడి కూస్తుంది, అయితే కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. లేదమ్మా "ఎంగుం " అన్నీ కోళ్ళు కూస్తున్నాయి "వంద్" తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది.  సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాళ్ చెబుతుంది.

నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. "మాదవి ప్పందల్ మేల్" మాదవి లత ప్రాకిన పందిరి మీద "పల్గాల్" అనేక సార్లు  "కుయిల్ ఇనంగళ్" కోకిలల గుంపులు "కూవిన కాణ్" కూస్తున్నాయి.


భహుషా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, "పందార్ విరలి" బంతి చేతులలో కలదానా. ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమిలాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాడం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆదీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.

"ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ"  నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం. "శెందామరై క్కైయాల్" నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో "శీరార్ వళై ఒలిప్ప" నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా,  "మగిరింద్" అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమ తో, ఆనందంతో  "వందు తిఱవాయ్" నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెరవాలి అంటూ నీళాదేవిని అమ్మ లేపింది.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి